తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడు ఒక ప్రత్యేకమైన కవి. ప్రతిభ, పాండిత్యం అనే రెండు ప్రధానగుణాలు ఆయనలో మూర్తీభవించాయి. తన కావ్యాలలో ఆయన ప్రయోగించినన్ని జాతీయాలు, లోకోక్తులు, నుడికారాలు, పద్యాల ఎత్తుగడలు ఏ యితర తెలుగుకవీ ప్రయోగించలేదు. కవిత్రయమైన నన్నయ, తిక్కన, ఎర్రనలు ఆయనకు మార్గదర్శకులైనట్లే ఆయన తన తరువాత కవుల కందరికీ కావ్యరచనావిధానంలో మార్గదర్శకుడైనాడు. ఆనాడు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రెడ్డిరాజులు, విజయనగరరాజులు, పద్మనాయకరాజులు ఆయనను అపూర్వంగా అభిమానించారు; ఆదరించారు; సన్మానించారు.
సంస్కృతంలో శ్రీహర్షమహాకవి రచించిన "నైషధీయచరితం" అనే ప్రౌఢకావ్యాన్ని శ్రీనాథుడు "శృంగారనైషధం" అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యానువాదం. శబ్దాన్ని అనుసరించటం, భావాన్ని పెంచటం, అభిప్రాయాన్ని తగ్గించి చెప్పటం, రసాన్ని పోషించటం, అలంకారాలను అందంగా వాడటం, ఔచిత్యాన్ని పాటించటం, అనౌచిత్యాన్ని పరిహరించటం, మూలాన్ని అనుసరించటం వంటి ప్రత్యేకపద్ధతులను ఆయన తన కావ్యానువాద విషయంలో పాటించాడు. ఈ పద్ధతులన్నీ తక్కిన కవులకు ఆదర్శమైనాయి. ముఖ్యంగా ప్రబంధయుగానికి లేదా రాయలయుగానికి శ్రీనాథుని శృంగారనైషధం దారిచూపింది. ఏకనాయకాశ్రయత్వం, శృంగారరసప్రాధాన్యం, వర్ణనాప్రాచుర్యం, శయ్యానైగనిగ్యం, వస్వైక్యం అనే ఐదు రకాల ప్రబంధజీవలక్షణాలు శృంగారనైషధంలో మనకు కనిపిస్తాయి. క్షేత్రమాహాత్మ్యాలను వివరించే భీమఖండం, కాశీఖండం గ్రంథాలు శ్రీనాథుడికి "క్షేత్రమహిమాచార్యు" డనే ప్రసిద్ధిని తెచ్చిపెట్టాయి. “కవిసార్వభౌముడు" అనే బిరుదు తెలుగుకవులలో శ్రీనాథుడికి మాత్రమే ప్రప్రథమంగా దక్కింది. అంతకుముందు ఎవరికీ అంతటి సార్థకమైన బిరుదు లేదు. అలాగే కనకాభిషేకం.............................