|
కరాచీలో తీరంలో సంక్షోభం కాండ్లా రేవులో ఉండగా కరాచీ వెళ్తున్నాం అని తెలిసింది. చాలా దేశాలు తిరిగినప్పటికీ, పొరుగునే ఉన్న పాకిస్తాన్ వెళ్లడం అదే తొలిసారి. అది ఏప్రిల్, 1980. మాది బాగా డొక్కు ఓడ; పాతబడ్డ ఆయిల్ టేంకర్. మా కార్గో డీజెల్ ఆయిల్. కాండ్లాలో నింపుకొని, కరాచీలో డిస్చార్జి చెయ్యాలన్నమాట. పెద్ద దూరం లేదు. అప్పుడు మాకు దాని ప్రాముఖ్యత తెలియదుగానీ, ఆ మధ్యాహ్నం పూట, కరాచీ రేవుకి చేరుకొనే దారిలో తిన్నగా వెళ్లి, అణుశక్తితో నడిచే అమెరికా యుద్ధ నౌక, బ్రహ్మాండమైన ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్, యూ.ఎస్.ఎస్. 'నిమిట్జ్' కాళ్ళకు ఆడ్డంపడ్డాం. సరిగ్గా అప్పుడే మా ఇంజిన్ చెడిపోయింది. ఆ ఓడలో నేను థర్డ్ ఇంజినీరుగా పని చేస్తున్నాను. ఛీఫ్ ఇంజినీరు పంపగా, కేప్టెన్కి పరిస్థితిని వివరించడానికని, బాయిలర్ సూట్లోనే నేవిగేషన్ బ్రిడ్జి మీదకి వెళ్లాను. అతగాడూ, మిగతా డెక్ ఆఫీసర్లూ ఆందోళన చెందుతున్నారని అర్థం అయింది. ఎదురుగా భూతంలాగా యుద్ధనౌక 'నిమిట్జ్"! ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ ఒంటరిగా ఎన్నడూ సముద్రంలోకి ప్రవేశించదు. దాని చుట్టూతా డిస్ట్రాయర్లు, అమెరికన్ నేవీకి చెందిన అనేకానేక చిన్నా చితకా యుద్ధనౌకలు, గస్తీ నౌకలు, హెలికాప్టర్లు. సరిగ్గా 'నిమిట్జ్'కి ఎదురుగా మా డొక్కు టాంకర్. ఇంజిన్ ఆగిపోయి నీళ్లల్లో తేలుతూ, కెరటాలు, గాలి ఎటు నెట్టితే అటు కదులుతూ తచ్చాడుతున్నాం. ఉప్పుగాలి కబుర్లు * ll |