ఒక కథ చెప్తాను. వింటారా?
అసలు ప్రేమంటే ఏంటి? అది మనలో పుడుతుందా? లేక మనం దానిలో పడతామా? మనల్ని తన బానిసలను చేసుకునే ఈ ప్రేమ, మన దాకా వచ్చే ముందు ఏవైనా సంకేతాలు ఇస్తుందా? లేదా మన మనస్సు తన సొంతిల్లులా భావించి దాన్ని ఆక్రమించేస్తుందా? తీరా మనకు అనుభవం లేని ఈ అనుభూతి ప్రేమే అని తెలిసిన తరువాత మన జీవితాన్ని అందంగా మార్చేస్తుందా? ఆ బంధాన్ని బలపరిచే క్లిష్టమైన పరీక్షలను కూడా అధిగమించాలంటుందా?
ప్రేమ గురించి ఇన్ని అనుమానాలున్న నాకు, మనస్సులోని ఆలోచనలను కాగితంపై పెట్టాలనిపించింది. సందేహాలకు ఉపాయం వెతుకుతున్న నా అక్షరాల్లో నుంచి జన్మించినదే ఈ కథ.
అ.. ఆ..
ఒక అపరిచిత ప్రేమకథ.
ఈ కథ నా ఊహల్లోంచే పుట్టుకొచ్చినా, ఇందులోని పాత్రలు మాత్రం కల్పితాలు కావు. మీ జీవితంలో ఇటువంటి వారిని కచ్చితంగా కలిసుంటారు. లేక ఏదో ఒక పాత్ర మీరే పోషిస్తున్నారేమో?
ప్రేమ రెండక్షరాల పదం. ఇద్దరిని దగ్గర చేసే పదం. వారి జీవితాలని తారుమారు చేసే పదం. మారుతున్న రోజులు, అభివృద్ధి వైపుగా పయనించే యువత ప్రేమకి అర్థం మార్చి, కొత్త రంగులు పూస్తున్నారు.
ఒకప్పుడు ప్రేమ గుడ్డిదనే వారు. నా ఆలోచనలు ఆ రోజుల్లోనే ఆగిపోయినట్టున్నాయి. అందుకే అప్పటి ప్రేమను ఇప్పటి యువతకి పరిచయం చేయాలనిపించింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లేని రోజులవి - మరి వీటి ద్వారానే ఈ పుస్తకానికి పరిచయమైన పాఠకులు ఈ కథను ఎలా స్వీకరిస్తారో?...............................