వాచవి
- ప్రాచార్య బేతవోలు రామబ్రహ్మం,
రాష్ట్రపతి పురస్కార (లెటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ ఇన్ క్లాసికల్ తెలుగు) గ్రహీత;
కేంద్రసాహిత్య అకాడమీవారి “భాషాసమ్మాన్”,
“అనువాద పురస్కారాల" గ్రహీత;
అనేకానేక పురస్కారాల గ్రహీత.
బహిరంతర్వ్యక్తిత్వాలకు సయోధ్య సాధించిన ధీరులు చాలా అరుదుగా తటస్థపడతారు. నా ఎరుకలో బ్రహ్మశ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తిగారు అటువంటి అరుదైన మహామనీషి, వేదం తప్ప, వేదాంగాలూ, వేదాంతాలూ, క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కావ్యాలూ, కావ్యాంగాలూ సరే సరి. సంస్కృతాంధ్రాలలో ప్రౌఢసుందరమైన, తాత్త్వికతాబంధురమైన, కవిత్వం రచించిన ఘనత వీరిది.
అధ్యయనం - అనుష్ఠానం అనే బలమైన రెండు రెక్కల మీద ఆధునిక విజ్ఞాన వీధుల్లోనూ, జీవనాధ్వంలోనూ, “ద్రాగటాట్య సాగించే గరుడాళ్వారులు వీరు. వెనకటికి విశ్వనాథ సత్యనారాయణ గారు "నేను మనస్సంన్యాసిని" అన్నారు. ఆ మాట వీరికి కూడా అక్షరాలా సరిపోతుంది. అందుకే, కాబోలు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామివారు (అప్పాజీ) వీరిని తమ పీఠానికి విద్యాధికారిని చేసుకొన్నారు.
స్వామివారి జీవితచరిత్ర, భక్తిగీతాలు, భక్తిమాల, భగవద్గీతావ్యాఖ్యానం, యోగవాసిష్ఠాంధ్రీ కరణం - ఇలా వీరి రచనల జాబితా, అదొక అష్టోత్తరశతం.
శ్రీశైలస్వామిగా ప్రసిద్ధులైన శ్రీశ్రీశ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామివారు - పూర్వాశ్రమంలో వీరి జనకులు. ఈ స్వామివారి జీవితచరిత్రను సాక్షిమాత్రకథన పద్ధతిలో సంతరించి “సంసారం నుంచి సాయుజ్యం దాకా” అన్న పేరుతో సర్వజనపఠనీయ వచనకథాకావ్యంగా లోకానికి అందించి, పితౄణం తీర్చుకొన్న భాగ్యశాలి వీరు.
ఈ కృష్ణమూర్తిగారిని దత్తత తీసుకొన్న పుణ్యదంపతులు బ్రహ్మశ్రీ కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి-శ్రీమతి రాజ్యలక్ష్మీ కుటుంబగారలు. ఈ ఆంజనేయశాస్త్రిగారు షట్ఛాస్త్ర పండితులు. "సర్వతంత్ర విశారద, వ్యాకరణస్థాపనాచార్య" ఇత్యాది సార్థక బిరుదాంచితులు. విశేషించి పాణినీయం వీరికి కరతలామలకం. అందుకే, నడిచే దేవుడిగా ప్రసిద్ధిగన్నవారు, శ్రీకాంచీ కామకోటి.....................................