కృష్ణాతీరం
దివిసీమలో ఎండలు ముదిరినాయి, ఎండవలసిన చెట్టూచేమా ఎందుకొచ్చి నాయి. ఎండు పట్టడం మ్రాకుల్లోనే కాదు, మనుషుల్లోనూ ఉంది.
అలాంటి వారిలో ఒకడు బుచ్చన్న అవనిగడ్డ గ్రామంలో వున్న బ్రాహ్మణ్యంలో యించుమించు అందరూ ఓపాటి మోతుబరులే - చెదురువాటుగా ఓ పదో పాతికో, చాలీచాలని సంసారాలు ఉన్నాయి, పువ్వులతోబాటు పత్రిలాగా.
ఆ బహు కొద్దిమందిలోనూ, ఓ విధంగా చూస్తే ప్రథమ గణనీయుడు - యితగాడు! తిండికి బొటాబొటిగా సరిపోయే గింజలు రాలే చేనుంది. పప్పూ, ఉప్పు వగైరాలంటే - వున్నది నాళ్ల నడుమ కనుక, ఏదో నోటి మంచితనాన ఎలాగో సర్దుకుపోవడం పరిపాటి అయింది. అది యీ తరంలో పుట్టింది కాదు; తండ్రి నాటి నుంచి వస్తున్న ఆనవాయత.
అయితే, తండ్రి హయాములో . కొంత మెరుగు! ఆయనకు పిత్రార్జితం మూడెకరాలన్నర పైచిలుకుండేది. ఆయన స్వంతంగా చేసుకునేవాడు. తీరువా అని, సిస్తనీ, యీ అమాంబాపతులూ పోను యింటికో నలభై బస్తా చేరేది. అది వారికి ఎక్కీ దక్కీ - అదీ గాకుండా, ఆయనకు రకరకాల వ్యాపకాలు ఉండేవి. నిత్యమూ రాత్రిపూట పురాణము జెప్పేవాడు, సంపన్న గృహస్థుల యింట్లో - అంతేగాకుండా, స్మార్తం క్షుణ్ణంగా చెప్పుకున్నవాడేమో! పౌరోహిత్యంలోకి దిగలేదన్న మాటేకాని, కాస్త ముక్కు మొగం ఎరుగున్న వాళ్లింట్లో ఏ పూజో, పుణ్యాహవాచనమో అంటూ ఏదన్నా తలపెడితే అందుకు ముందీ అన్నప్ప సిద్ధం! అల్లాగని దాన్నే నమ్ముకున్నవాళ్ల నోళ్లు కొట్టేవాడనా - ఎబ్బే! ఇచ్చుకునే సత్తువలేక పొడి తాంబూలం చేతిలో పెట్టి.....................