హృద్యమైన గీతాల ఆనంద్ బక్షి అంతరంగ ఆవిష్కరణ
జో తార్ సే నిక్ హై వో ధున్ సబ్ నే సునీ హై
జో సాజ్ పె గుజరీ హై వో కిస్ నే సునా హై...
'చాంద్ కీ దీవార్' (1964) సినిమాలో సాహిర్ లూధియాన్వీ రాసిన పాట ఇది. సంగీత వాయిద్యం తీగ నుండి వెలువడిన రాగాన్ని అందరూ వింటారు. కానీ ఆ మధురమైన రాగం అనుభవించిన వేదనను ఎవరు గ్రహించగలరు? ఇది సాహిర్ అడిగిన ప్రశ్న.
ఈ ప్రపంచంలోని మనుషులందరికీ వర్తించే ప్రశ్న ఇది, ముఖ్యంగా కళాకారులకు మరింతగా వర్తిస్తుందీ ప్రశ్న.
ఒక కళాకారుడి 'కళ'ను చూస్తుంది ప్రపంచం. నచ్చితే మెచ్చుతుంది. మరీ నచ్చితే తల మీద పెట్టుకుని ఊరేగిస్తుంది. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తృణీకరిస్తుంది. ఒక్క క్షణం కూడా ఆగి ఆలోచించదు. ఆ కళాసృజన వెనుక కళాకారుడి తపన, శ్రమ, పడ్డ కష్టం, అనుభవించిన వేదన... ఇవేమీ ప్రపంచానికి పట్టలేదు. కళాకారుడు ఎంతో శ్రమపడి, వేదనను అనుభవించి సృజించి సమర్పించే హృదయపు తునకను చూసి మెచ్చుకునో, తృణీకరించే ప్రపంచానికి అతడి హృదయం, హృదయ వేదనలు, అనుభవాలు, బాధలు, సంఘర్షణలు, ఆశనిరాశలు ఏమీ అవసరం లేదు. రాకేశ్ ఆనంద్ బక్షి రాసిన ఆనంద్ బక్షి జీవిత చరిత్ర అనువాదం (అనువాదకుడు: కొల్లూరి సోమ శంకర్) చదువుతుంటే, ఇలాంటి పలు ఆలోచనలు మనసులో మెదులుతాయి. ముఖ్యంగా, ఆనంద్ బక్షి జీవిత చరిత్రను రచించింది అతని తనయుడే అవటం ఈ జీవిత చరిత్ర ప్రాధాన్యతని ఇనుమడింపచేస్తుంది.
ఆనంద్ బక్షి పాటలు తెలియనివారు, విననివారు ఉండరు. దేశంలో వీధి వీధినా మారుమ్రోగాయి అతను రచించిన పాటలు. ప్రతి హృదయంలో ఈనాటికీ ప్రతిధ్వనిస్తున్నాయి అతని పాటలు. 'ఎక్ బంజారా గాయే, జీవన్ కా గీత్ సునాయే' వంటి పాటలు జీవించేందుకు సరైన దారిని చూపిస్తూ ప్రేరణనిస్తున్నాయి. 'యే రేష్మీ జుల్ఫేఁ, యే షర్బతీ ఆంఖేఁ' వంటి పాటలు.............................