సమాగమం
ప్రేమలో పరుగెత్తి, పరుగెత్తి - మనసంతా చెమటతో
వేగాన్ని, వేడినీ కోరికనూ నిందిస్తూ - వాంఛ తీరని
విరాగమంతా తిరిగి ప్రయాణమవడం వరకే
పునరావృతం దేనికీ తప్పదు.
మళ్ళీ పరుగు, మళ్ళీ చిత్తడి
ప్రేమలో ఇతివృత్తం ఎప్పుడూ కథకన్నా పెద్దది.
ఈ శరీరం ఎప్పుడూ ఆత్మకు బిగుతై పోతుంది.
పెదవులతో శరీరాన్ని వెలిగించి - ఆలింగనంతో ఆత్మను జతచేసి
చివరకు అంతా తడబాటు, అయోమయం!
ఆలోచన, తర్కం, వితర్కం, ఆదర్శం, లయ, మోక్షం
అన్నీ అనుభూతిలో దిగ్బంధం అయిపోతాయి!
ప్రవాహం ముగిశాక తేటగా మెరిసే రాతిలాగా-
అంతఃచేతనం ఆవిష్కరించబడుతుంది.
మంచుతో వంగి దించుకు పోయిన పూలపొద
సూర్యోదయానే తేలికపడి సర్దుకుంటుంది.
కోరిక వున్నంతసేపే మనం దివ్యులం, పూజ్యులం
శరీరం, ఆహార్యం, అహంకారం - అన్నీ మన అంతఃచేతనకు గవాక్షాలు
నీ జ్ఞాపకాల స్పర్శ తగిలినపుడల్లా నిశ్శబ్దం ఆత్మలో స్ఫురించడం
హృదయం బరువెక్కి మంచుతో కప్పిన పూలగుత్తిలా వాలడం
నేలను చీల్చుకొని ఆకాశం వైపు లేచే మొక్కలా శరీరం గగుర్పొడవడం!
ఒక్కడినే నిద్రలేచినపుడు - ప్రయాణం చివరన ఒక్కడినే మిగిలినపుడు
వేల వృక్షాలతో ఊగే మహారణ్యం కూడా మోడుగా తోస్తుంది.
హృదయానికి మాటలెంత బరువో - మౌనం అంతే బరువు
వెలుతురు ఎంత స్పష్టమో - చీకటి అంతే స్పష్టం.................................