వంచితులు
“అన్నం తిందువుగాని రావేందయ్యా!" భర్తను కమలమ్మ పిలవటం ఇది మూడో సారి.
సమాధానంగా కనకయ్య వులకనూ లేదు, పలకనూ లేదు. తన మాట మొగుడి చెవిని బడిందో, లేదో కమలమ్మకు అర్థంకాలేదు.
నెలరోజుల క్రితం అర్ధాంతరంగా కట్టుబడి నిలిచిపోయిన డాబా ఇంట్లో నులక మంచం వేసుకొని పడుకొనివున్నాడు కనకయ్య. వేళకింత ముద్దపడందే లబలబలాడే మనిషికి పదిరోజులమట్టి తిండి మీద ధ్యాస లేకుండాపోయింది. బలవంతం మీద పళ్లెం ముందు కూచున్నా నాలుగు ముద్దలు నోట్లోకి దిగటంలేదు.
డాబా ఇంటికి పదంగల్లో వున్న పెంకుటింటి వసారాలో నుంచి కనకయ్య దగ్గరకు వచ్చి, “అన్నం తిందువు రమ్మని పిలుత్తుంటే యినిపించుకోవేందయ్యా!” అంది కమలమ్మ. “ఆకలెయ్యటం లేదే!” అన్నాడు తలెత్తి భార్యకేసి చూస్తూ.
“యాలకింత ముద్ద తినకపోతే ఎట్టాగు!" అనునయంగా అనింది కమలమ్మ. మాసిన గడ్డం, పీక్కుపోయిన ముఖంతో భర్తను చూస్తుంటే కమలమ్మకు ఉసూరుమనిపించింది.
కమలమ్మ చేతులమీద నల్లగా పెచ్చులుగట్టి రాలిన గాయపు చారలు కంటబడుతూనే కనకయ్య మనసు ఆవేదనతో బరువెక్కింది. ఇంత అరాచకంగా పోలీసులు చేత మేకులు దించిన లాఠీలతో దెబ్బలు తినాల్సిన అగత్యం పట్టిందేమని మధన పడసాగేడు.
"రమణయ్య ఎక్కడ?” అడిగాడు.
"ఇంకేడికి బోతాడు! దీక్షా శిబిరం కాడికే. పెద్దనాయకులు ఎవరో వస్తున్నారట.” “ఎవరొచ్చి మాత్రం ఏంచేస్తారే! చెవిటోడి ముందు శంఖం వూదినట్టే. అరవై రోజుల బట్టి మా గతేందని మొత్తుకొంటున్నాం. యినిపించుకొంటన్నారా! చివరికి మన బతుకుల్ని బజారుకీడ్చారు.” కనకయ్య గొంతు పెగల్లేదు.
“లెగుమరి! మనం కూడా కాస్త ఎంగిలిపడి ఆ శిబిరం కాడికే పోయి కూచొందాం. ఊరంతా ఆడికే పోతున్నారు.” తొందరచేసింది.
ఇక తప్పదన్నట్టు లేచాడు కనకయ్య...........................