ఇది మొదలు
జపాన్, 2025
సన్రైజ్... తూర్పు క్యాన్వస్ పైన ప్రకృతి గీసిన ఒక అందమైన పెయింటింగ్. మనకోసం మొదలయ్యే రోజుని ఇంత అందంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఏ శక్తికి కలిగిందో కానీ, ఆ శక్తికి మాత్రం దండం పెట్టాల్సిందే. ప్రపంచమంతా వెలుగునిచ్చే ఆ సూర్యుడు, అందరికంటే ముందుగా ఈ జపాన్నే చూడాలనుకుంటాడు కాబోలు. అందుకే దీన్ని, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్, అంటారు. గంటకి 90కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న నా కారు అద్దంలోంచి చూస్తుంటే, సూర్యుడు మెల్లగా తన నిద్రను వదిలించుకుని, వెలుగుని తన ఒంటికి పులుముకొని, నిండు కమలాపండులా నిగనిగలాడుతూ కనిపించాడు.
రెండు అణుబాంబుల భారాన్ని గుండెల మీద మోసిన ఈ దేశం, ఎదురుదెబ్బనే ఎదుగుదలకు పునాదిగా మార్చుకుంది. విత్తనాన్ని మట్టి ఎంత అణిచిపెట్టినా, ఆకాశం నుండి జారే చినుకు తడి తగలగానే ఎలాగైతే మొలకెత్తుతుందో, జపాన్ కూడా అలాగే ప్రపంచానికి ఎదురు నిలబడింది. ఆశలతో పైకి ఎగబాకింది. కల్పవృక్షానికి ఏ మాత్రం తీసిపోకుండా కొన్ని కోట్ల జీవితాలకి తిరిగి ప్రాణం పోసింది........................