సంకెళ్ల సవ్వడికి భయపడే ఆధిపత్యం
'సత్యాన్ని చాటే పుస్తకాల్ని నిషేధించగలవు గాని, సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని ఏం చేస్తావు' అని విప్లవ కవి ఎన్ కె 1971లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిషేధాల మీద స్పందించాడు. సాక్ష్యంగా బతికిన ప్రపంచానికి ఎంత చరిత్ర ఉందో పాలకుల పుస్తక నిషేధాలకూ అంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ప్రాచీన గ్రీసులో సోక్రటీసుకు విషపాత్ర అందించడం, చైనాలో క్విన్ షి హువాంగ్ చక్రవర్తి జరిపిన పుస్తక దహనాలు, భారత ఉపఖండంలో చార్వాకుల బోధనలు చెరిపి వెయ్యడం, హనుమకొండలో వీరశైవులు జైన గ్రంథాలయాన్ని తగులబెట్టారన్న ఐతిహ్యం, ఆధునిక కాలపు నిషేధాలు, విచారణలు... పుస్తకాల మీద ఆంక్షల చరిత్ర రెండున్నర వేల ఏళ్లది. మధ్య యుగాలలో క్రైస్తవ సంప్రదాయంలో ఈ నిషేధం ఎంత విస్తరించిందంటే పదహారో శతాబ్దిలో చర్చ్ ఏకంగా నిషిద్ధ పుస్తకాల జాబితానే ప్రచురించింది. ఆధునిక కాలంలోనైతే రాచరికాలైనా, తమను తాము ప్రజాస్వామ్యాలమనీ, గణతంత్రాలమనీ, ప్రజాపాలన అనీ, కమ్యూనిస్టు అనీ పిలుచుకున్న అన్ని రాజ్యాలలో పాలకులందరికీ భావవ్యాప్తిని అడ్డుకోవడం, పుస్తకాన్ని నిషేధించడం చాలా ఇష్టమైన మృగయా వినోదం. పుస్తకాలకు సంబంధించినంతవరకు మనది దహనాల, నిషేధాల, హత్యల, ఆంక్షల, ఉపేక్షల, విస్మరణల, చెరిపివేతల చరిత్ర. అదే సమయంలో అక్షరం అన్న పేరుకు తగ్గట్టుగానే పుస్తకానిది చిరంజీవిత చరిత్ర, అనంత ధారల చరిత్ర, అజరామర చరిత్ర...................