మనిషినీ, వెలుగునీ కలిపే కవిత్వం
బసవన్న గురించి చిన్నప్పుడే విన్నప్పటికీ, ఎక్కడో ఒకచోట ఆయన వచనాలు ఒకటో రెండో చదివినప్పటికీ ఆయన పట్ల ఆసక్తి కలిగింది మాత్రం 1993-94 ప్రాంతంలో, అప్పట్లో మా హీరాలాల్ మాష్టారు కర్నూలు జిల్లాలో ఉన్న ఉరుకుంద వీరన్న మీద ఒక పుస్తకం రాసారు. ఆయన నాకు ఆ పుస్తకం పంపితే నేనది శరభయ్యగారికి పంపించాను. ఆ పుస్తకం చదివి ఆయన రాసిన ఉత్తరం నేను మరవ లేనిది. అందులో ఆయన బసవన్న ఒక చేత్తో క్షీరభాండమూ, మరొకచేత బెత్తము పట్టుకుని తనని చేరవస్తున్నాడని రాసారు.
ఆ తర్వాత 2002-03 ప్రాంతంలో రాజమండ్రిలో మాష్టారిని కలిసినప్పటికి ఆయన బసవేశ్వరవచనాలు సంస్కృతంలోకి అనువదించడం పూర్తిచేసారు. ఆ రోజు నేను ఆయనతో సంస్కృతకవుల గురించీ, కవిత్వం గురించీ మాట్లాడించబోతే ఆయన 'ఇప్పుడు నన్ను పూర్తిగా బసవేశ్వరుడు ఆవహించి ఉన్నాడు. అధ్యైవ శివస్య భజనమ్, అద్యైవ శివస్య స్మరణమ్' అంటున్నాడు అని అన్నారు. ఆయన్ని ఒక్కోకాలంలో ఒక్కో సంస్కృతాంధ్ర కవి ఆవహించడం నాకు తెలుసుగాని, బసవన్న మరీ ఒక జ్వరంలాగా పట్టుకున్నాడు. ఆయన్ని అనిపించింది అప్పుడు.
ఆ తర్వాత ఎ.కె. రామానుజన్ Speaking of Shiva చదివాను. అలాగే బసవన్న గురించి ఎక్కడ ఏ సమాచారం లభ్యమైనా ఆసక్తిగా చదివాను. కాని పూర్తి వచనాలు చదివే అవకాశం మాత్రం వెంటనే చిక్కలేదు. అలాగే అప్పట్లో ఆయన నన్ను మరీ సమ్మోహితుణ్ణి చేసాడని కూడా చెప్పలేను.
ఈ లోగా 2009-10లో జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారి పరిచయమయింది. ఆయన్నూ నన్నూ కలిపింది ఆముక్తమాల్యదనేగాని, ఆయన సాంగత్యంలో చేరాక వచనకారులు గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం? జోళదరాశి దొడ్డన గౌడగారి పైన ఆయన రాసిన పుస్తకం 'శరణుడు-బసవడు' (2011) కి నన్ను ముందుమాట....................