కొత్త వాకిళ్లను తెరచిన కథకుడు
అజో-విభో-కందాళం ఫౌండేషన్ చారిగారి మూలంగా శివకుమార్ పరిచయమయ్యారు. ఆయన తెచ్చి ఇచ్చిన 20 కథలను ఒక్కచోట, ఒక్కమారుగా చదవగలిగే అవకాశం దొరికింది. శివకుమార్ కథలను ఫౌండేషన్ ఒక సంపుటిగా వెలువరిస్తోందని చారిగారు తెల్పారు. కథలకు పరిచయ వాక్యాలు రాయమన్నారు. ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాలకు వారధిగా నిలుస్తున్న అజో-విభో-కందాళం ఫౌండేషన్, శివకుమార్ కథలను వెలువరిస్తున్నందుకు అభినందించాలి. పరిచయం రాయమని అడిగినందుకు సంతోషం కలిగింది సంకోచంతో పాటుగా.
సంపుటిలో 20 కథలున్నాయి. ఇవి 2004 - 2015 మధ్య వచ్చినవి. తాను ఇంతవరకు రాసిన 40 కథలనుంచి ఎంపిక చేసిన మొదటి కథల సంపుటి ఇది. కథలను చదువుతున్నప్పుడు, భారతీయ వలస రచయితలు, తెలుగు అమెరికన్ వలస రచయితలు మనసులో మెదులుతూనే ఉన్నారు- శివకుమార్ కథల వస్తు శిల్పాలను గురించిన ఆలోచనలు, స్పందనలతో పాటుగా.
తమ పూర్వులో, తామో వచ్చిన మాతృభూమిపట్ల మమకారం, భావప్రేరణలు వలస రచయితలకు ఒకవైపు ఉంటాయి. మరొకవైపు స్వ / పర దేశంపట్ల గౌరవాభిమానాలు, పూర్తిగా ఇమిడీ ఇమడని తత్వం ఉంటాయి. వలస జీవితాల్లో ఎన్నెన్నో ఒడిదుడుకులూ, గజిబిజి మనస్తత్వం ఉండటం కూడా సహజం. భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరమైన ఒత్తిడులు ఉండటం కూడా అంతే సహజం. ప్రాదేశికపరమైన వైరుధ్యాలూ, అస్తిత్వగతమైన మానసిక ఘర్షణలూ వలస జీవితానికి తప్పనిసరి. గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడింటి లంకెలను వలస జీవనంలో ఏ రకంగా కూర్చుకోవాలో అనే విచికిత్స నిరంతరం ఉంటుంది. భావుకులైన రచయితలు ఈ సంవేదనను సృజనాత్మక వచన రచనలైన కథల్లో, నవలల్లో చిత్రించటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నం వల్ల తెలుగు సాహిత్యంలో ప్రవాస........................