బాటముచ్చట
నా అమ్మ నాన్నలు వలసకూలీలు. ఖాత గ్రామం నుంచి ముండ్రాయి గ్రామానికి వలసవచ్చిన్రు. ఈ రెండు గ్రామాలు నంగునూరు మండలం సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. మా నాన్నతోపాటు చిన్నాన్న కూడా ముండ్రాయికి వలస వచ్చిన్రు. కాని తెలివిగా కొంత భూమిని సంపాదించుకుని వ్యవసాయం చేసుకున్నడు.
ముండ్రాయిలో నా అమ్మనాన్నలను ఖాత శంకరవ్వ, ఖాత ఎంకయ్య అని పిలిచేవారు. ఖాతలో మాత్రం మా పేరుకు ముందు దారం ఉండేది. నాన్నను నాయిన అని అమ్మను అవ్వ అని పిలిచేవాన్ని. ఆరుగురు సంతాన భారంతో కూలీలుగనే నెట్టుకొచ్చిన్రు.
నేను ముండ్రాయి గ్రామంలో పుట్టిన. అప్పటికి భారతదేశం వలసదేశమే! నేను పుట్టిన రెండేళ్లకు దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నా మాతృభూమి నిజాం రాజ్యం. నిజాంకోట గోల్కొండ కోటలో నా మాతృభూమి బంధీగా ఉన్నది. బంధ విముక్తికి సాయుధ రైతాంగ పోరాటమే జరిగింది. దేశ కొత్తపాలకులు నిజాం రాజును లొంగదీసుకుని నా మాతృభూమిని దేశంలో విలీనం చేసుకున్నరు.
నాదేశం భారతదేశం. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను! నేను పుట్టింది కూలీల కడుపున. మా అవ్వ రైతుకూలి. మా నాన్న అనేక కూలీపనులు చేసిండు. భూ యజమానుల దగ్గర పాలేరుగా చివరిదాక పని చేసిండు. అభిమానం అడొచ్చి కావచ్చు స్వంత ఊరికి తిరిగి పోలేదు. ఎంత శ్రమించినా 'ఆస్తి' ఏమీ సంపాదించలేదు...................