దోపిడి
దొంగిలించడానికి ఏం దొరక్కపోతే దొంగ తను నిజాయితీపరుడని భావిస్తాడు.
అమెరికాలో న్యూజెర్సీ సముద్రతీరంలోని ఓ గోడౌన్లో దొంగతనం చేయమని బాస్ రాస్కీ తన అనుచరులు జానీ, విక్టర్లకి పురమాయించాడు. అతని పథకం ప్రకారం ఆ తోడుదొంగలు తెల్లవారుఝాము రెండున్నరకి గోడౌన్ వెనక కిటికీని పగలగొట్టుకుని లోపలకి ప్రవేశించారు. టార్చ్ లైట్ వెలుగులో, ఫ్రాన్స్ నించి దిగుమతైన సిగరెట్ పెట్టెల కార్టన్స్ ని బయట ఆపిన వెన్లోకి ఎక్కించడం ఆరంభించారు.
అకస్మాత్తుగా విక్టర్కి అలికిడి వినిపించడంతో తన మిత్రుడికి సైగ చేసాడు. జానీ వెంటనే చేతిలోని పెట్టెని యథాస్థానంలో ఉంచి టార్చ్ లైట్ని ఆఫ్ చేసి చెవులు రిక్కించాడు. తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించడంతో ఒకరికొకరు సైగలు చేసుకొని విశాలమైన గోడౌన్లో చెరోమూలకి వెళ్ళి నక్కారు. వాళ్ళకి ఆకస్మాత్తుగా ఓ గొంతు వినిపించింది.
“జానీ, విక్టర్. మీ ఇద్దరూ ఇక్కడున్నారని నాకు తెలుసు. చేతులెత్తి బయటికి రండి. ”
అది సార్జెంట్ ఆర్నాల్డ్ కంఠస్వరంగా ఇద్దరూ గుర్తుపట్టారు. తాము ఈ సమయంలో ఇక్కడికి దొంగతనానికి వచ్చినట్లు పోలీసులకి ఎలా తెలిసింది అనే ఆలోచన తోడుదొంగలు ఇద్దరికీ కలిగింది. ఆ సమాచారం కేవలం తమ బాస్ రాస్కీకే తెలుసు. కాబట్టి అతనో లేదా అతని మనుషులో తమని పట్టించే పథకం వేసారని ఇద్దరూ తేలిగ్గా ఊహించారు..................................