అదృశ్యానికి ఆవల
చరిత్రను విజేతలు రాస్తారంటారు. కానీ జ్ఞాపకాలను మాత్రం ఓడిపోయినవారే మోస్తారు. ఆ జ్ఞాపకాలే ఒక జాతి అస్తిత్వాన్ని నిలబెడతాయి. పాలస్తీనా రచయిత్రి ఇన్తిసామ్ అజెమ్ రాసిన 'ది బుక్ ఆఫ్ డిసప్పియరెన్స్' అలాంటి జ్ఞాపకాల కలబోత. ఇది అదృశ్యమైన మనుషుల కథ మాత్రమే కాదు, చెరిపివేయాలనుకుంటున్న చరిత్రను, నిరాకరించబడుతున్న అస్తిత్వాన్ని నమోదు చేసే సాహిత్య సాక్ష్యం.
ఒక ఉదయం ప్రపంచం కళ్లు తెరిచే సరికి పాలస్తీనా ప్రజలంతా అదృశ్యమైపోతారు. ఈ అసాధారణ కల్పన వెనుక ఒక భయానక చారిత్రక వాస్తవం ఉంది. ఆ వాస్తవం పేరు నక్బ. లక్షలాది మంది పాలస్తీనీయులు తమ భూమి, ఇళ్లు, గ్రామాలు, పేర్లు, జ్ఞాపకాలను కోల్పోయిన మహా విషాదం అది. ఆ చరిత్రను మౌనంతో, ఖాళీతో, జ్ఞాపకాలతో తిరిగి పాఠకుడి ముందుంచుతుంది రచయిత్రి.
ఈ నవలలో అదృశ్యమయ్యేది కేవలం మనుషులు కాదు. ఒక భాష, ఒక సంస్కృతి, ఒక భూభాగం, ఒక జాతి సామూహిక స్మృతి. భౌగోళిక ఆక్రమణతో పాటు జ్ఞాపకాల ఆక్రమణ కూడా ఎలా సాగుతుందో, స్థలాల పేర్లను మార్చడం నుంచి చరిత్రను తిరగరాయడం వరకు అధికార రాజకీయాలు ఎలా పనిచేస్తాయో ఈ రచన అత్యంత సూక్ష్మంగా ఆవిష్కరిస్తుంది.
ఇబ్రిసామ్ అజెమ్ రచనలో రాజకీయ ప్రకటనల కంటే మానవ అనుభవమే ప్రధానంగా నిలుస్తుంది. కోల్పోయిన ఇంటి జ్ఞాపకం, సొంత నేలను చేరుకోవాలనే అంతులేని నిరీక్షణ, అస్తిత్వం కోసం సాగుతున్న అంతర్మథనం, మౌనంలో దాగిన ప్రతిఘటన - ఇవన్నీ కలసి ఈ నవలను సమకాలీన ప్రపంచ సాహిత్యంలో విశిష్ట స్థానంలో నిలబెట్టాయి. పాలస్తీనా విషాదాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచంలోని ప్రతి నిర్వాసిత సమాజం అనుభవించే బాధకూ ఇది ప్రతిధ్వని........................