నివేదన
తెలంగాణామ్ము తమః కవాటముల బందీయైన నిశ్శబ్ద రా
త్రులలో మేల్కొని; 'కోటితమ్ము' లను మేల్కొల్సన్ మహోల్కాసము
జ్వల కాంతిస్ఫురదగ్ని గీతికలు అభ్రమ్మంటగా పాడి; తె
ల్గులలో వెల్గుల నాటినట్టి కవితాలోకప్రభా నీరధీ!
దాశరథీ! మనోజ్ఞకవితాశరధీ! శరదిందుచంద్రికా
పేశల కావ్యఖండముల పిండిన నీ కలమందునన్ మహో
గ్రాశనిపాతముల్ వెలయునౌర! మహేశుని కంటిలో సుధా
రాశి తరంగముల్ కటు హాలాహల కీలలు పొంగినట్లుగా.
సాహిత్యమ్మున నిత్యనూతన వికాసశ్రీల వర్షించు నీ
ఊహాబ్దమ్ములలో పదమ్మిడని వారున్నార? సారస్వతుల్
“ఓహో! దాశరథీ! మహాకవి" యటంచుదోషముల్ చేసినన్
సౌహిత్యమ్మున లేశమాత్రము కళంకమ్మైన రానీవుగా...............