ఎవరి బానిసలు వీళ్ళు?
'నీ బాంచెన్ కాల్మొక్తా,' 'దొరా నీ గులాపోన్ని,' అంటూ బతికే, బతికిన మాల మాదిగలు సర్వ సందలను సృష్టించే సృష్టికర్తలు. గ్రామాల్లో శిశువు పుట్టినప్పుడు బాలెంత స్నానానికి కొల్లు గుంటలు తవ్వడం, వాయిలాకు తేవడం, పెళ్ళిళ్ళలో, ఇతర శుభకార్యాలలో డప్పు కొట్టడం, అన్ని శుభకార్యాలకు పనులు చేయడం, కాళ్ళు కందకుండా చెప్పులు కుట్టడం, వ్యవసాయానికి అవసరమయ్యే తాళ్ళు, తలుగులు, పగ్గాలు తయారు చేయడం, చెప్పుల తయారీ, తోలు వస్తువుల తయారీ, తొండం, తొండం తాళ్ళు తయారీతో పాటు చనిపోతే పాడి గట్టడం, బొంద పెట్టడం, కాట్నం పేర్చడం, శవ దహనం చేయడం లాంటి పనులన్నీ చేసేది దళితులు. ఊరి సుంకర్లుగా, నీరడికాళ్ళుగా, కాపలాదారులుగా, ఊరు చాటింపు చేసేవాళ్ళుగా, వెట్టి వాళ్ళుగా రకరకాల పనులు చేస్తూ దేశసంపదకు మూల స్తంభాలుగా ఉంటున్నది వీళ్ళు. వీళ్ళు సృష్టికర్తలు. కాని ఏ పనీ చేయని విశ్రాంతి కులాలకు మాత్రం బానిసలుగానే ఉంటున్నారు.
మనుధర్మ శాస్త్రం విధించిన ఆంక్షలు వీళ్ళను అంటరానివాళ్ళుగా, అన్నీ చేసినా వేటినీ అనుభవించని వాళ్ళుగా ఉంచుతుంది. భారతదేశంలో అంటరాని తనమనేది ఏజాతీ క్షమించలేని నేరం. ఈ దళితులు, బాధాసర్పదష్టులైన మాల మాదిగలు ఈ దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. మా ఊళ్ళోనూ ఉన్నారు. చెప్పులు కుట్టే చిలుక రాజయ్య, డప్పుకొట్టే పీరయ్య, నీరటి కొండయ్య, వెట్టి మాదిగలు, మాలలెంతో మందిని నేను చిన్నప్పట్నుంచీ చూస్తున్నాను. వాళ్ళు పడుతున్న బాధలను, ఎంత కష్టపడ్డా కడుపు నిండని బతుకు వెతలను, అవమానాలను చూస్తున్న నాకు హృదయం బాధతో మూల్గేది. సర్వసందల సృష్టికర్తలైన వీళ్ళు నీ బాంచెన్ కాల్మొక్తా అంటూ ఎందుకంటున్నారో, ఎందుకుండాలో అర్థమయ్యేది కాదు. బాల్యంనుంచీ.............................